ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాలి కవిత

కాళేశ్వరం,అర్జున్ సమాచారం:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంపు హౌస్ వద్ద ప్రాణహిత ప్రవాహాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి.నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తాం. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు.ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను  చెబుతున్నామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా బాధలో ఉన్నారు. నిజానికి మన తెలంగాణలో ఉన్న రెండు పెద్ద నదులు గోదావరి, కృష్ణా నీళ్లను సరిగా వాడుకుంటే మనకు కరువు అనే పరిస్థితే ఉండదు.మనం తెలంగాణ కోసం పిడికిలి ఎత్తి ఉద్యమం చేసింది కూడా మా నీళ్లు మాకు కావాలనే. నీ తెలంగాణ వచ్చాక మన నీటిని సంపూర్ణంగా వాడుకున్నామా అంటే వాడుకోలేదు.తెలంగాణ ఏర్పడిన తర్వాత వానలు సరైన టైమ్ కి రావటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా టైమ్ గడిచిపోయింది. బీఆర్ఎస్ టైమ్ లో కృష్ణా నది ప్రాజెక్ట్ ల పై కొంత పనులు చేసి 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. 🔹ఉత్తర తెలంగాణలో ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు కు నీళ్లు ఇస్తూ 37 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేసే ప్రయత్నం చేశారని అన్నారు.
మొత్తంగా లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి స్థిరీకరణ మాత్రమే చేశారు. కాళేశ్వరంలో కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఈ విషయం మనం చెబితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మనపై దాడి చేస్తారు. కానీ నిజాలు మారవు. వాస్తవాలు కచ్చితంగా కఠినంగానే ఉంటాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఘోరంగా పరిస్థితి తయారైంది. రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసి కొత్త ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. అడిగితే బకాయిలు చెల్లించామని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, దళిత బంధు లాంటి బకాయిలు చెల్లించకుండా ఇవే ఎందుకు చెల్లించినట్టు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాణహిత నది వద్ద ఎంత కరువు పరిస్థితులు ఉన్న సరే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతుంటాయి. వీటిని సరిగా వాడుకుంటే మన రైతుల పొలాలకు నీళ్లు మంచిగా ఇవ్వొచ్చు. అందుకే ఈ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇస్తూ సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తున్నాం. మేము పార్టీ పెట్టిన కొత్తలో కూడా కృష్ణానది నీళ్లకు సంబంధించి నార్లపూర్ వద్ద రిజర్వాయర్ గురించి సొల్యుషన్ చెప్పాం. ఇప్పుడు కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల పైన కాఫర్ నిర్మిస్తే సమస్య పరిష్కరించవచ్చు. మేడిగడ్డకు సంబంధం లేకుండా ఇక్కడ నుంచి అన్నారం, సుందిళ్లకు నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఈ నీళ్ల ద్వారా ప్రతి ప్రాజెక్ట్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ. 25 కోట్లు ఖర్చు పెడితే నెలన్నర రోజుల్లో ఈ పనులు పూర్తి చేయవచ్చు. ఎల్ నినో పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాది కూడా వానలు పడుతాయో లేదో అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మన కళ్ల ముందే రోజు 2 టీఎంసీల నీళ్లు పోతున్న వాడుకోవటం లేదు. ఈ విషయంలో రైతుల కోసం ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం వినకపోతే వారికి ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసని అన్నారు.
తెలంగాణలో కోటి 36 లక్షల సాగు భూమి ఉంటే ఈ సారి కోటి 10 లక్షల ఎకరాలు సాగైంది. ఇప్పుడు పంట చివరి దశలో ఉంది. రైతులకు నీళ్లు, కరెంట్ అవసరం ఉంది, అందుకే మేము ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుక్కొనైనా, కొనుక్కవచ్చైనా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి స్పందించి కేంద్రాన్ని కరెంట్ అడుగుతామని చెప్పారు. సమస్యపై పోరాటం చేయటమే కాకుండా సొలుష్యన్ కూడా చెప్పాం. కాళేశ్వరం కోసం దాదాపు 93 వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లను ఇచ్చేందుకు కాలువలు తవ్వకపోవటంతో కొత్త గా 19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వటం సాధ్యం కావటం లేదు.  కాలువలను పూర్తి చేయాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలాగు అంత ఖర్చు చేసే పరిస్థితిలో లేదని అన్నారు.
ఇప్పటికే ఎల్లంపల్లి సహా అన్ని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయి. ఎల్లంపల్లిలో ఉన్న నీళ్లను తాగునీటి కోసం అని స్టోర్ చేశారు. రానున్న పదినెలలు మనం భయంకరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 21 వేల చెరువులు ఎండిపోయి ముదిరాజ్, బెస్త సోదరులకు ఈ ఏడాది పనిలేని పరిస్థితి వచ్చింది. ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము చేస్తున్న మంచి సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.